బలప్రదర్సనకు వైయస్ జగన్ రెడీ, రేపే కలెక్టరేట్ల వద్ద ధర్నాలు

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తన బలప్రదర్శన చేయనున్నారు. తనకు గల ప్రజల మద్దతును ఆయన చాటి చెప్పడానికి సిద్ధపడ్డారు. రైతు సమస్యలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తారు. ఈ సందర్భంగా తనకు గల ప్రజా బలాన్ని చూపించాలనేది జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పాల్గొంటారు. జెరూసలేం నుంచి వచ్చిన తర్వాత జగన్ పాల్గొనే తొలి కార్యక్రమం ఇది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేపట్టే ధర్నాలకు తెలంగాణ జిల్లాల్లో ఏ మేరకు ప్రతిస్పందన లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధర్నాలను తెలంగాణవాదులు అడ్డుకుంటారా, లేదా అనేది కూడా ఆసక్తికరంగానే ఉంది. వైయస్ జగన్‌తో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుమ్మక్కయ్యారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌ పార్టీ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందనేది చూడాల్సి ఉంది.

తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకు జగన్‌ను కూడా తెలంగాణలో అడ్డుకుంటామని తెరాస నాయకులు గతంలో ప్రకటించారు. జగన్ పార్టీకి తెలంగాణలో మద్దతిచ్చే నాయకులు ఎవరనేది కూడా ధర్నాల సందర్భంగా తేలిపోతుందని అంటున్నారు.

No comments :

Post a Comment

Total Pageviews

Status