త్వరలో ఫైనల్స్... డిపాజిట్లు దక్కవు

రైతు కనీస మద్దతు ధరకు పంటను అమ్ముకోలేని దుస్థితిలో ఉన్నాడు
రైతు సమస్యలపై పోరాడాల్సిన
బాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు
త్వరలో మళ్లీ వైఎస్ సువర్ణయుగం
రైతు మొహాన చిరునవ్వు చూసే రోజు దగ్గరలోనే ఉంది
నాకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను విమర్శించే నైతికత చిరంజీవికి ఉందా?

కడప(వైఎస్సార్ జిల్లా), న్యూస్‌లైన్ బ్యూరో: ‘ఈ రాష్ట్రంలో ఏ రైతూ తాను ఉత్పత్తి చేసిన వరి ధాన్యాన్నిగానీ, శనక్కాయనుగానీ, పత్తినిగానీ కనీస మద్దతు ధరకు అమ్ముకోలేని దుస్థితిలో ఉన్నాడు. ఏ రైతు మొహానా చిరునవ్వు లేదు. మద్దతు ధర ఇచ్చే ప్రభుత్వం లేదు. రైతులు, పేదల సమస్యలపై పోరాడాల్సిన చంద్రబాబు.. కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు. ప్రతి రైతూ, ప్రతి పేదా ఈ ప్రభుత్వం కూలిపోవాలని చూస్తున్నాడు. మొన్న జరిగిన ఉప ఎన్నికలు సెమీ ఫైనల్స్.. త్వరలో జరగబోయే ఎన్నికలు ఫైనల్స్. ఆ ఫైనల్స్‌లో ఈ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన ఓదార్పు యాత్రలో భాగంగా రాజుపాళెం మండలం వెంగళాయపల్లె గ్రామంలో ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వెంగళాయపల్లె గ్రామంలో 600 ఓట్లు పోలవగా.. తనకు 500కుపైగా ఓట్లు వచ్చాయని.. గ్రామ ప్రజలు తనకు అఖండ మెజారిటీ ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. రాజుపాళెం మండలంలో పోలైన 20వేల ఓట్లలో 9,500 ఓట్ల మెజారిటీ ఇచ్చి తనను దీవించినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. ‘మొన్న జరిగిన ఎన్నికలు సెమీ ఫైనల్స్ మాత్రమే. ఆరు నెలలు కావచ్చు.. ఒక సంవత్సరం కావచ్చు... రెండేళ్లు కావచ్చు... త్వరలో ఫైనల్స్ జరుగుతాయి. ఈసారి వైఎస్ సువర్ణయుగం మళ్లీ వస్తుంది. ప్రతి రైతు సోదరుడి మొహాన చిరునవ్వును చూసే ఆ రోజు దగ్గరలోనే ఉంది’ అని జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు.

పోరాడే ప్రతిపక్షం లేదంటే బాధనిపిస్తుంది: ‘రైతుల కోసం పోరాడాల్సిన చంద్రబాబు నాయుడు ఆ పని చేయడం లేదు. రైతులు, పేదలు, సామాన్య ప్రజలందరూ ఈ ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటుంటే, చంద్రబాబు నాయుడు అధికార పార్టీతో కుమ్మక్కైపోయారు. అవిశ్వాస తీర్మానం పెట్టకుండా కాంగ్రెస్‌తో జతకట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో, రైతు మొహాన చిరునవ్వు చిందే కాలంలో, కేవలం 46 మంది ఎమ్మెల్యేలున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇప్పుడు ప్రజలే ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని ఎదురు చూస్తుంటే చంద్రబాబు.. కనీసం ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి అనే ఆలోచన కూడా చేయడం లేదు. ప్రజల సమస్యల కోసం పోరాడాల్సిన ప్రతిపక్షం రాష్ట్రంలో లేదంటే బాధనిపిస్తుంది’ అని జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు వైఖరిని విమర్శించారు.

అడుగడుగునా నీరాజనం

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ఓదార్పు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ యాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రొద్దుటూరు పట్టణంలో ఉలసాల బాలరంగయ్య, గోకుల భాస్కర్, చోళవేటి నాగేశ్వరరావు, ఎర్రమాసు పీటర్ కుటుంబాలను, కాకిరేణిపల్లె గ్రామంలో జంగాలపల్లి గంగన్న కుటుంబాన్ని ఓదార్చారు. జగన్ యాత్ర సాగిన ప్రాంతాల్లో ప్రజలు భారీగా వీధుల్లోకి వచ్చి ఆయన్ను చూడ్డానికి తాపత్రయ పడ్డారు. ఆయనతో కరచాలనానికి ఉత్సాహం చూపారు. యాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, ప్రొద్దుటూరు నియోజకవర్గ నేతలు రాచమల్లు ప్రసాదరెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పల్లా విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్‌ఏ.నారాయణరెడ్డి, ఖాదీబోర్డు మాజీ డెరైక్టర్ కొర్రపాడు నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

ఆ నటుడికి నైతికత ఉందా?
‘నాకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నైతికత ఉంటే రాజీనామా చేయాలని సినీ నటుడు చిరంజీవి అంటున్నారు. వైఎస్ వల్ల అధికారంలోకి వచ్చామన్న కృతజ్ఞతతో వారు నాకు నైతిక మద్దతు ఇస్తున్నారు. అధికార పార్టీవైపు ఉంటే వారికి చాలా లబ్ధి కలుగుతుంది.. వారు ఆ లబ్ధిని కూడా వదులుకుని.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మీద ప్రేమతో.. ఆయన కుటుంబాన్ని ఒంటరిగా చూడలేక.. నైతిక విలువలకు నిలబడి నాకు అండగా ఉన్నారు. ఆ సినీ నటుడు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని ఇష్టమొచ్చినట్లు తిట్టి.. ఈ రోజు పదవుల కోసం సిగ్గులేకుండా అదే పార్టీ పంచన చేరాడు. పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశాడు. ఆ సినీనటుడికి నైతికత ఉందా? లేక అన్నీ కష్టాలు నష్టాలేనని తెలిసినా వైఎస్ కుటుంబానికి అండగా నిలబడిన ఈ ఎమ్మెల్యేలకు నైతికత ఉందా?’ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

No comments :

Post a Comment

Total Pageviews

Status