మహిళలకు వడ్డీలేని రుణాలివ్వాలి

మహిళా సంఘాలకు మంజూరు చేసే రుణాలపై వడ్డీని కేంద్ర ప్రభుత్వం 12 శాతం నుంచి 7శాతానికి తగ్గించిందట
*అప్పుడు రాష్ట్రంలో పావలా వడ్డీ రుణాలను వడ్డీ లేకుండానే ఇవ్వొచ్చు
*అలా చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి 2 శాతం నిధులు మిగులుతాయి
*కానీ పావలా వడ్డీని కొద్దో గొప్పో తగ్గిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం చూస్తే బాధనిపిస్తోంది
*40 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్కసారైనా స్పీకర్ ఎన్నికలకు పోటీపెట్టారా?
*చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలిపి స్పీకర్ ఎన్నికను రాజకీయం చేసి అవిశ్వాస తీర్మానాన్ని దారిమళ్లించారు
*చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు.. బాబు అలాకాకుండా కుమ్మక్కై మొసలి కన్నీరు కారుస్తున్నారు

కొత్తచెరువు, పెనుకొండ నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘ఇవాళ(బుధవారం) పేపర్‌లో చూశాను. మహిళా సంఘాలకు రుణాలపై వడ్డీని 12% నుంచి ఏడు శాతానికి తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందట. దీని ప్రకారం చూస్తే ఇకపై మహిళలకు అసలు వడ్డీ లేకుండానే రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ.. పాలకులు మాత్రం పావ లా వడ్డీని కొద్దో గొప్పో తగ్గిస్తాంలే అని హేళనగా మాట్లాడ్డం చూస్తే బాధనిపిస్తోంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం వడ్డీని తగ్గించింది కాబట్టి.. మీపై భారం కూడా తగ్గుతోంది కాబట్టి.. ప్రతి అక్కా, ప్రతి చెల్లికి వడ్డీలేని రుణాలివ్వాలన్న ఆలోచన మీరు ఎందుకు చేయట్లేదు అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

మంగళవారం ఓ కార్యక్రమంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మహిళలకు ఇచ్చే రుణాలపై కేంద్రం వడ్డీని తగ్గించిన దృష్ట్యా.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పావలా వడ్డీ శాతాన్ని మరింత తగ్గిస్తాం’ అని అన్నారు. దీన్ని ఉద్దేశించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పై వ్యాఖ్య లు చేశారు. బుధవారం అనంతపురం జిల్లాలో మూడో రోజు ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన పుట్టపర్తి, కొత్తచెరువు, పెనుకొండ, మండలాల పరిధిలోని 20 గ్రామాల్లో పర్యటించారు. బ్రాహ్మణపల్లి గ్రామం, కొత్తచెరువు, పెనుకొండ మండల కేంద్రాల్లో వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. భారీగా తరలివచ్చిన ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ఆ అన్నే రాజశేఖరరెడ్డి
ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మ ముఖంలో చిరునవ్వులు ఉండాలని.. వారు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుం దని.. ఆ కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తేనే అది సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక అన్న గట్టిగా నమ్మారు. ఆ అన్నే దివంగత నేత వైఎస్సార్. ప్రతి అక్కా, చెల్లెల్ని లక్షాధికారిని చేయడానికి ఆయన పావలా వడ్డీ రుణాలను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోనే కాదు కదా దేశంలోనే ఇలాంటి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు వైఎస్సార్.

వడ్డీ లేకుండానే రుణాలివ్వొచ్చు..
వైఎస్సార్ బతికున్న రోజుల్లో కష్టమొచ్చినా.. న ష్టమొచ్చినా ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మను సంతోష పెట్టాలని, వారిని లక్షాధికారిని చేయాలని రూపాయి వడ్డీలో ముక్కాలు వంతు(75 పైసలు) తన ప్రభుత్వమే భరించేలా ఆయన పావలా వడ్డీకే రుణాలు అందించారు. అంటే 12% వడ్డీలో మహానేత వైఎస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం.. 9 శాతం భరించేది. మూడు శాతం వడ్డీ(పావలా) మహిళా సంఘాలు చెల్లించాల్సి వచ్చేది. ఇవాళ మహిళా సంఘాలకిచ్చే రుణాలపై వడ్డీని కేంద్ర ప్రభుత్వం 12% నుంచి 7 శాతానికి తగ్గించిందట. ఇలా తగ్గిస్తే.. రాష్ట్ర ప్రభుత్వంపై ఇంతవరకు పడుతున్న వడ్డీ భారం 9 శాతంలో 5 శాతం తగ్గినట్లే కదా! అలాంటప్పుడు ఇంతవరకు మహిళలు చెల్లించాల్సి వస్తోన్న పావలా వడ్డీ(3 శాతం) కూడా లేకుండా వారికి రుణాలు ఇవ్వొచ్చన్న ఆలోచన ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? అలా వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చినప్పటికీ ఇంకా 2 శాతం నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికే మిగులుతాయని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు?

అవిశ్వాసం పెట్టమంటే.. పెట్టవేం..
ప్రతిపక్షనాయకుడు చంద్రబాబునాయుడు రోడ్లెక్కి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. నేను అడుగుతున్నాను... చంద్రబాబు గారు.. మీకు పేద ప్రజలపై నిజంగా ప్రేమే ఉంటే.. ఈ ప్రభుత్వానికి వారం రోజుల గడువిచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేయండి. ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలా వడ్డీ పథకాలకు బకాయిలను చెల్లించాలని అడగండి.
రైతుకు మద్దతు ధర కోసం రూ.2 వేల కోట్లు కేటాయించమని డిమాండ్ చేయండి. అలా చేయకుంటే మరో వారం రోజుల్లో నోటీసులు పంపి ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానని చెప్పండి. కానీ మీరు చెయ్యరు గాక చెయ్యరు. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయారు. 

చిరంజీవైతే నేరుగా తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు.. కానీ చంద్రబాబు అలా చేయకుండా ఆ పార్టీతో కుమ్మక్కై ప్రజల దగ్గర మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇవాళ చంద్రబాబు గారిని చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. రాష్ట్రంలో 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో స్పీకర్ ఎన్నికలకు ప్రతి పక్షం పోటీపెట్టిందే లేదు. అయితే చంద్రబాబు స్పీకర్ పదవికి పోటీపెట్టి.. రాజకీయం చేసి అవిశ్వాస తీర్మానం అంశాన్ని దారి మళ్లించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడ దక్కవు. రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు వస్తాయి. వైఎస్సార్ సువర్ణయుగం మళ్లీ వస్తుంది. కచ్చితంగా వస్తుంది.

మూడోరోజు.. 56 కిలోమీటర్లు.. 
అనంతపురం జిల్లాలో మూడోరోజు బుధవారం ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్ 56 కిలోమీటర్లు ప్రయాణించి నాలుగు బాధిత కుటుంబాలను ఓదార్చారు. నాలుగు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి, ఐదు చోట్ల ప్రసంగించారు. పుట్టపర్తిలో సత్యసాయి మహాసమాధి దర్శనంతో యాత్ర ప్రారంభించిన జగన్ తర్వాత ఎనుములపల్లిలో రామప్ప కుటుంబాన్ని, బ్రాహ్మణపల్లిలో నారాయణస్వామి కుటుంబాన్ని, మరవకుంటపల్లిలో మల్లెల లక్ష్మీదేవి కుటుంబాన్ని, పెనుకొండలో దర్గా పీఠాధిపతి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మహ్మద్‌ఖాన్ కుటుంబాన్ని ఓదార్చారు. పెనుకొండలో రాత్రి12.00 గంటలకు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేశారు. యాత్ర సాగిన ప్రతి ప్రాంతంలో జగన్‌మోహన్‌రెడ్డిని చూడ్డానికి జనం బారులు తీరారు. దీంతో ఆయన పర్యటన కొంత ఆలస్యంగా సాగిం ది. 

కొత్త చెరువులో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జెండా ఆవిష్కరణకు ఇసుక వేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. ఇక్కడ కొత్తచెరువు మండలంతో పాటు పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీల నేతలు అధిక సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఓదార్పుయాత్రలో పాల్గొన్నవారిలో అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ తోపుదుర్తి కవిత, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కడపల మోహన్‌రెడ్డి, వైటీ ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ నర్సింహయ్య, నేతలు సోమశేఖర్‌రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ తదితరులున్నారు

No comments :

Post a Comment

Total Pageviews

Status